వైసీపీకి ‘లోకల్’ షాక్..భారీ నష్టం తప్పదా?

-

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయంలో వాస్తవం ఉందనే చెప్పాలి..పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆధిపత్య పోరు బయటపడింది. బహిరంగంగానే పోరు జరిగే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఈ పోరుకు చెక్ పెట్టడానికి ఎక్కడకక్కడ వైసీపీ అధిష్టానం కూడా ప్రయత్నిస్తుంది. ఎన్నికల నాటికి ఈ పోరు అలాగే ఉంటే వైసీపీకి చాలా ఇబ్బందయ్యే పరిస్తితి కనిపిస్తుంది. అయితే పై పైన కనిపించే పోరు కంటే..స్థానికంగా జరిగే ఆధిపత్య పోరు తారస్థాయిలో ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు పొసగని పరిస్తితి కనిపిస్తుంది. పంచాయితీ, పరిషత్, మున్సిపల్..ఏ ఎన్నికలైన వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. దీంతో ప్రతిచోటా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ డబ్బులు భారీగా పెట్టి గెలిచారు గాని…వారికి అనుకున్న మేర ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలదే మొత్తం పెత్తనం ఉంటుందని, కనీసం తమకు గౌరవం కూడా ఇవ్వట్లేదు అని కొన్ని స్థానాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు.

 

అటు సర్పంచ్‌ల పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు..పెద్దగా నిధులు అందక గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేని పరిస్తితి ఉందని కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇటు స్థానిక నేతలకు సైతం నిధులు అందని పరిస్తితి ఉందని తెలుస్తోంది. దీంతో పలు చోట్ల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజా ప్రతినిధులు గళం విప్పే పరిస్తితి కనిపిస్తుంది. ఇలా ఎక్కడకక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్న పరిస్తితి.

ఒకవేళ వారు గాని కాస్త యాక్టివ్ గా లేకపోతే లోకల్ గా వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సర్పంచ్‌లతో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులని పట్టించుకుని…వారి అసంతృప్తిని తగ్గించాల్సిన బాధ్యత వైసీపీ అధిష్టానంపై ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news