పాలిసెట్-2023 ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. పరీక్షను మే రెండో వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో జరిగిన అధికారుల సమావేశంలో నిర్ణయించారు. మరోసారి సమావేశం నిర్వహించి ఎంట్రన్స్ తేదీని ఖరారు చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. మరోపక్క తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యా మండలి శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఇప్పటివరకు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో చేరే అవకాశం మాత్రమే ఉండేది. ఇకపై ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి ఆపేస్తే ఇంటర్ ఫస్టియర్ కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యా మండలి ప్రతిపాదించింది. ఈ సర్టిఫికేట్ తో నేరుగా ఇంటర్ సెకండియర్ లో చేరవచ్చు. రానున్న విద్యా సంవత్సరం నుండి మార్పులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.