తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నట్లు.. అంతేకాకుండా కాంగ్రెస్‌కు తెలంగానలో ఉనికి లేదంటూ వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. అయితే.. తాజాగా.. బీజేపీ, టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ పడతాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ అవినీతి చేస్తున్నాడని పదే పదే చెప్తున్న బీజేపీ నేతలు..ఈడీ, సీబీఐలతో ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు పొన్నం ప్రభాకర్. బీజేపీ వాపును చూసుకొని బలుపు అనుకుంటుందని చురకలంటించారు పొన్నం ప్రభాకర్.
బీజేపీ, టీఆర్ఎస్లు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని, మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ బీజేపీ అని, 8 ఏండ్లు అయినా రాష్ట్ర విభిజన హామీలను బీజేపీ నెరవేర్చలేదని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ..తెలంగాణ అమరవీరులను అవహేళన చేసిందని చెప్పారు. అలాంటి బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని..రెండు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. మునుగోడు ప్రజలు తెలంగాణ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు పొన్నం ప్రభాకర్.