ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడం పై అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ వాదనలు వినాలని ఈడీ కూడా కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. కవిత తరపున కపిల్ సిబల్ వాదన వినిపించారు. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ఈడీ, కవిత తరపున లాయర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే కవిత తన పిటిషన్ లో సరికొత్త అభ్యర్థనను చేర్చారు. మద్యం కుంభకోణం కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు.