తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర అనే పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఒక విడత పాదయాత్ర చేసిన బండి సంజయ్.. రెండో విడత పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 14 నుంచి రెండొ విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ప్రారంభం కానుంది.
అంబేడ్కర్ జయంతి వేడుకల తర్వాత.. అలంపూర్ జోగులంబ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 31 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర.. 387 కిలీ మీటర్లు జరగనుంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్ర కోసం 30 నిర్వహణ కమిటీలు, 2,000 మంది వాలంటీర్లు పని చేయనున్నారు.
మొత్తం 10 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరగబోయే పాదయాత్రకు.. ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలకు జాతీయ నాయకులు రానున్నారు. ఈ రెండో విడత పాదయాత్ర మే 14న మహేశ్వరంలో ముగుస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు.