యూపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ఆ రాష్ట్రంలో రాజకీయంపై ద్రుష్టి సారిస్తున్నాయి. తాజాగా యూపీలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ భారత దేశాన్ని నిర్మించిందని, దేశంలో రైల్వేలు, విమానాశ్రయాలు, రహదారులను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, అయితే బీజేపీ వాటిని అమ్ముకుంటోందని ప్రియాంకా గాంధీ అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ వారు అడుగుతున్నారని, కానీ బీజేపి వాళ్లు 70 ఏళ్ల ప్రయత్నాన్ని కేవలం 7 ఏళ్లలో వృథా చేశారు’’ అని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రియాంకా గాంధీ విమర్శించారు. యూపీలో నిరుద్యోగం ప్రధాన సమస్య అని, యూపీలో 5 కోట్ల మంది నిరుద్యోగ యువకులు ఉన్నారని ప్రియాంకా గాంధీ తెలిపారు. నిరుద్యోగం కారణంగా ప్రతిరోజూ ముగ్గురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని ఆమె అన్నారు. యూపీలో యోగీ ఆదిత్యనాథ్ పాలనతో అన్ని కులాలకు అన్యాయం జరగుతుందని ఆమె విమర్శించారు. బీజేపీలో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు విమర్శిస్తున్నాయని, తాను చనిపోయినా కూడా.. బీజేపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు.