కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు(డిసెంబర్ 31) నుంచి జనవరి 15 వరకు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు బీచ్‌లు, క్రీడా మైదానాలు, సముద్ర తీరాలు, పార్కులు, పబ్లిక్ ప్లేస్‌లతోపాటు విహార యాత్ర ప్రదేశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకలు, రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు ముంబయి పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
శుక్రవారం నుంచి జనవరి 15 వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఒకే చోట పెద్ద ఎత్తున జనం గుమిగూడటంపై నిషేధం ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటం, ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.