ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అర్థాంతరంగా వాయిదా పడింది. పంజాబ్లోని ఫిరోజ్ పూర్ లో ఈరోజు మోదీ పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అక్కడే బహిరంగ సభలో మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే సభాస్థలికి వెళుతున్న క్రమంలో మోదీకి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మోదీ కాన్వాయ్ ను 20 నిమిషాల పాటు నిరసనాకారులు అడ్డుకున్నారు. ముందుగా హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉన్నా.. వాతావరణ కారణంగా చివరి నిమిషంలో సభాస్థలికి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలోనే హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నారు. దాదాపుగా 15-20 నిమిషాలు ఫ్లై ఓవర్ పైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
అయితే దేశ ప్రధాని కార్యక్రమానికి పంజాబ్ ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలమైందని.. కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఘటనపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.