గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు స్టార్ షట్లర్ పీవీ సింధు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మంత్రులు , ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఎట్ హోమ్‌కు హాజరైన అతిథులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుపేరునా పలకరించారు.
అంతకుముందు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్పిపల్ స్టేడియంలో జరిగిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు భేష్ అని.. డీబీటీ ద్వారా నవరత్నాలు , అమ్మఒడి వంటి పథకాలు అర్హులకే అందుతున్నాయని ఆయన చెప్పారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రం ముందుకు సాగుగుతుందని గవర్నర్ చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్ధులకు పౌష్టికాహరం అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్దులకు పుస్తకాలు, దుస్తులు, కిట్స్ అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్ధులకు సీబీఎస్ఈ సిలబస్ ను అందిస్తున్నట్టుగా గవర్నర్ గుర్తు చేశారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.