రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ మెగా స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్‌కానుండగా.. ఆరంభోత్సవంలో భారత పతాకధారి గా పీవీ సింధు వ్యవహరించనుంది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ (ఐఓఏ) అధికారికంగా బుధవారం ఓ ప్రకటనని విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 6న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాని పతాకధారిగా ఎంపిక చేశారు. కానీ.. గాయం కారణంగా అతను కామన్వెల్త్ గేమ్స్‌కి దూరమవడంతో పీవీ సింధుకి అవకాశం దక్కింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ భారత పతాకధారిగా పీవీ సింధు వ్యవహరించింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఆ కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు రజత పతకం గెలుపొందింది.
ఈ నెల 17న సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన పీవీ సింధు.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. దాంతో.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ గెలుస్తుందని అంచనాలు వేస్తున్నారు. ‘‘ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకం గెలిచిన పీవీ సింధుని కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవంలో భారత పతాకధారిగా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని భారత ఒలింపిక్ అసోషియేషన్ ప్రకటనలో పేర్కొంది. పీవీ సింధుతో పాటు పతాకధారి కోసం వెయిట్‌లిప్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా పేర్లని కూడా పరిశీలించినట్లు ఐఓఏ ఆ ప్రకటనలో చెప్పుకొచ్చింది.