‘మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్’ చాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు..

-

ఇప్పటికే ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్ గురించి ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. అయితే.. నారాయణపేట్ కలెక్టర్ హరిచందన తెలంగాణలో చేనేత కార్మికులకు చేయూత నందించడం కోసం మొదలు పెట్టిన ‘మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. రోజువారీ జీవితంలో ఎక్కువ‌గా చేనేత వ‌స్త్రాల‌ను వినియోగించాల‌ని ఆమె కోరారు. చేనేత వ‌స్త్రాలు ధ‌రించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయాల‌ంటూ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్‌, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ను ట్యాగ్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ మ‌రో ముగ్గురికి ఈ చాలెంజ్ విస‌రాల‌ని కోరారు. ఈ స‌వాల్‌ను స్వీక‌రించిన స్మితా స‌బ‌ర్వాల్‌.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేశారు. ఈ క్ర‌మంలో పోచంపల్లి దుస్తులు ధరించిన ఫొటోను ఆనంద్ ట్వీట్ చేశారు. చిన్నప్పటి నుంచి తన తల్లి పోచంపల్లి దుస్తులనే ధరిస్తున్నారని తెలిపారు.

అనంతరం క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు వెంకటేశ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ట్యాగ్ చేశారు. తాజాగా సీవీ ఆనంద్ స‌వాల్ ను భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్వీక‌రించింది. చేనేత చీర ధ‌రించిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. చేనేత కళను సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి తెలంగాణ‌ ప్రభుత్వం తీసుకున్న చొరవ ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసింది. ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు త‌న‌ను ట్యాగ్ చేసిన‌ సీవీ ఆనంద్‌, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఇక‌పై తాను ఎక్కువ‌గా చేనేత వ‌స్త్రాల‌ను ఉప‌యోగిస్తాన‌ని తెలిపింది. తదుపరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు  హీరోయిన్లు స‌మంత‌, హ‌న్సిక‌, హీరో ద‌గ్గుబాటి రానాను సింధు ట్యాగ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version