టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ కోసం దొంగ ట్విట్లు చేస్తున్నారు – రఘురామ

-

 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసినట్లుగానే, దొంగ ట్విట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణుల మధ్య మనస్పర్ధలను సృష్టించే ప్రయత్నాన్ని తమ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తోందని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తు వికసించడం ఖాయమని తేలడంతో వెన్నులో భయంతో సోషల్ మీడియాలో దొంగ అకౌంట్లను సృష్టించి, ట్విట్లను పెడుతున్నారని, జనసేనతో పొత్తు అవసరం లేదని ఒక టీడీపీ నాయకుడు పేర్కొన్నట్లుగా ట్విట్ చేశారని అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి పేరిట 76 స్థానాలలో గెలుస్తామని దొంగ ట్విట్ చేసి ఉంటారని, దొంగ ట్విట్లు చూసి టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు అపోహ పడవద్దని, నాయకులు బాగానే ఉన్నారని అన్నారు.

ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే జరుగుతుందని, ఈ ప్రభుత్వాన్ని దించే వరకు నన్ను నమ్మండి అన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో తమ పార్టీ వెన్నులో వణుకు మొదలయిందని, ఓ ఎన్నారై చేసిన ట్వీట్ చూసి అతని పోలీసులు అరెస్ట్ చేయగా, న్యాయమూర్తి శిరీష గారు రిమాండ్ కు నిరాకరించారని అన్నారు. అయినా అతనిపై తప్పుడు కేసు బనాయించేందుకు పోలీసులు ప్రయత్నించారని, దళిత శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి గారు, ఆమె కుమార్తెలను సోషల్ మీడియా వేదికగా అసభ్య పద జాలంతో దూషించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా?, లేకపోతే తమ పార్టీ కోసం పని చేస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు, ప్రజలపై ఈ ప్రభుత్వ అరాచకాలు, దాష్టికాలు ఎక్కువయ్యాయని, ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్ష ఓటు చీలకుండా తమ కాంగ్రెస్ పార్టీ ముష్కరులు ఎన్ని మాయలు చేసినా టీడీపీ జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news