గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించారు.
గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 సబ్సిడీ ఇస్తామన్నారు. బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు.బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
అహ్మదాబాద్‌లో పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పారు. 3 వేల ఆంగ్ల మాద్యమ పాఠశాలలు నిర్మిస్తామని.. బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. “బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేస్తుంది. రైతులకు చేసిందని ఎప్పుడైనా విన్నారా” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.