శ్రీరామ నవమి పండుగ పూట సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. బస్సును ఢీకొట్టిన తర్వాత స్కూటీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్కూటీలో మంటలు చెలరేగి.. బైకుతో పాటు ఆర్టీసీ బస్సుకు మంటలు అంటున్నాయి. ఈ ఘటనలో స్కూటీ, రాజధాని బస్సు దగ్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజధాని బస్సు విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
‘మేం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నాం. మునగాల వద్దకు రాగానే ఎదురుగా ఓ స్కూటీ బస్సువైపునకే వచ్చింది. అకస్మాత్తుగా దూసుకొచ్చిన స్కూటీని తప్పించే సమయం కూడా దొరకలేదు. ఇంతలోనే మా బస్సును ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లింది. స్కూటీ బస్సు కిందకు దూసుకెళ్లడంతో డ్రైవర్ అప్రమత్తమై.. మమ్మల్ని కిందకు దిగమని చెప్పాడు. వెంటనే మేమంతా దిగాం. మా కళ్ల ముందే క్షణాల్లో స్కూటీ, బస్సు దగ్ధమయ్యాయి. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మరణించాడు. బస్సులో కొందరి ప్రయాణికుల సామగ్రి కూడా అగ్నికి ఆహుతైంది.’ – ప్రయాణికుడు