చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

అబుధాబిలో సోమ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 37వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో చెన్నైపై రాజ‌స్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

rajasthan won by 7 wickets against chennai in ipl 2020 37th match

మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 125 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. కేవ‌లం జ‌డేజా మాత్ర‌మే జ‌ట్టును ఆదుకునే య‌త్నం చేశాడు. 30 బంతులు ఆడిన జ‌డేజా 4 ఫోర్ల‌తో 35 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్‌, కార్తీక్ త్యాగి, ఎస్‌.గోపాల్‌, ఆర్‌.తెవాతియాల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్ 17.3 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో జాస్ బ‌ట్ల‌ర్ అర్ధ సెంచ‌రీతో రాణించాడు. 48 బంతులు ఆడిన బ‌ట్ల‌ర్ 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 70 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజ‌స్థాన్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. చెన్నై బౌల‌ర్లలో దీప‌క్ చాహ‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా హేజ‌ల్‌వుడ్‌కు 1 వికెట్ ద‌క్కింది.