రాజ్యసభ ఖాళీల భర్తీకై నేడు నోటిఫికేషన్ వెలువడింది. అయితే.. తెలంగాణలో మూడు ఖాళీలు భర్తీ కానుండగా.. ఇందులో ఓ స్థానానికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. దేశంలో 57 రాజ్యసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల భర్తీకై నోటిఫికేషన్ ఈ నెల 24వ తేదీన జారీ కానుంది. జూన్ 10వ తేదీ పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కానుండగా.. ఇందులో రెండు బీసీ, ఒకటి ఓసీ రిజర్వేషన్‌లో ఉన్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి మూడు స్థానాలు కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే దక్కనుండగా.. ఈ మూడు స్థానాల భర్తీకై మోత్కుపల్లి నర్శింహులు, లక్ష్మణరావు పీఎల్ శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు దామోదర్ రావు, సీఎల్ రాజం, హెటిరో పార్ధసారధి రెడ్డి పేర్లు పరిగణలో ఉన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఆసక్తిగా ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి వచ్చింది. కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్..కేసీఆర్‌తో సన్నిహతంగా మెలగడమే దీనికి కారణంగా పలువురు అంటున్నారు. జాతీయ రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్.. ప్రకాష్ రాజ్ పేరు పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. స్వతహాగా బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ అయితే రాజ్యసభకు సరిగ్గా సరిపోతుందనేది కూడా మరో ఆలోచనగా అనిపిస్తోంది. అయితే ఇప్పటివరకూ ఇదంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే విన్పిస్తున్న టాపిక్. దీనిపై అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. చూడాలి మరీ..