ఏదేమైనా గాని టీడీపీపై ఉన్న అభిమానం..చంద్రబాబుపై ఉన్న గౌరవం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తగ్గేలా కనిపించడం లేదు. ఎప్పుడైతే తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమని తెలిసి..గౌరవంగా ఆ పార్టీకి రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరారో అప్పటినుంచి బాబుని రేవంత్ ఒక్క మాట కూడా అనలేదు. బాబుపై ఎప్పుడు గౌరవంతోనే ఉంటారు. తమకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని, అధినేతని తిట్టకూడదు అనే పాలసీ రేవంత్ రెడ్డిది. అందుకే బాబుని పల్లెత్తు మాట అనరు.
ఇలా అనకపోవడం వల్లే రేవంత్ రెడ్డి..బాబు మనిషి అని విమర్శలు ఎదురుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్ళు సైతం ఇదే తరహాలో విమర్శిస్తున్నారు. అయినా సరే రేవంత్..బాబుని ఉద్దేశించి ఒక్క విమర్శ చేయలేదు. ఇలా బాబు పట్ల గౌరవంగా ఉండటంతో..తెలంగాణలో ఇంకా మిగిలి ఉన్న టీడీపీ అభిమానులు..రేవంత్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడే అదే రేవంత్‌కు అడ్వాంటేజ్ అవుతుంది. ఇదిలా ఉంటే..మునుగోడు ఉపఎన్నికలో గెలవాలంటే కాంగ్రెస్ బలం ఒక్కటే సరిపోదు అని..మిగిలిన వామపక్షాలు, ఇతర పార్టీల మద్ధతు అవసరం ఉందని రేవంత్‌కు అర్ధమవుతుంది.
అందుకే తాజాగా మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రేవంత్..కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ శ్రేణులని కోరడంతో పాటు కమ్యూనిస్టు కార్యకర్తలు కూడా మద్ధతు ఇవ్వాలని కోరారు. కమ్యూనిస్ట్ నేతలు టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేశారని, అయినా కార్యకర్తలు కాంగ్రెస్‌తో కలిసి రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే మునుగోడులో ఇంకా టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారని, వారు కూడా మద్ధతు ఇవ్వాలని అంటున్నారు.
అలాగే తనని బాబు మనిషి అంటున్నారని, ఆయన మనిషినైతే కాంగ్రెస్‌లో ఎందుకు ఉంటానని రేవంత్ ప్రశ్నించారు. చంద్రబాబు కూడా మొదట కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన తర్వాతనే టీడీపీలోకి వెళ్లారని, అదే తీరులో తాను కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చానని చెబుతున్నారు. అయితే దీని బట్టి చూస్తే రేవంత్‌కు టీడీపీపై అభిమానం ఇంకా ఉందని తెలుస్తోంది. అలాగే మునుగోడులో టీడీపీ అభిమానులు ఇంకా ఉన్నారు. అందుకే వారి మద్ధతు పొందేందుకు రేవంత్ గట్టిగానే ట్రై చేస్తున్నారు.