“ఏపీలో ప్రజలను పిప్పి చేస్తున్న మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తాం. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటాం. వారిని ఆర్థికంగా నాశనం చేస్తున్న మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి పారద్రోలతాం. అదేసమయంలో మద్యం జోలికి వెళ్లాలంటే.. భయం వేసే పరిస్థితిలో .. షాక్ ఇచ్చే స్థాయిలో ధరలు పెంచుతాం” ఇదీ.. ఎన్నికలకు ముందు 2019లో నిర్వహించిన పాదయాత్రలో వైసీపీ అధినేతగా .. విపక్ష నాయకుడిగా.. ప్రస్తుత సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన బలమైన హామీ.
అయితే.. ఇలానే చేస్తున్నారా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది.. అప్పటి వరకు ప్రైవేటు చేతిలో ఉన్న వైన్స్ దుకాణాలను.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో అంతగా ప్రభావితం చూపని.. ఆదాయం లేదని.. మద్యం దుకాణాలను 25 శాతం తగ్గించి.. తాము ఇచ్చిన మాటమీద నిలబడుతున్నామని.. తొలి ఏడాదే.. 25 శాతం దుకాణాలను రద్దు చేశామని.. ప్రభుత్వం ప్రచారం చేసుకుంది.
ఇక, రెండో ఏడాది వచ్చే సరికి.. అసలు.. రద్దు విషయాన్ని.. మద్య నిషేధం విషయాన్ని కూడా పక్కన పెట్టింది. అయితే.. ధరలను మాత్రం ఆకాశానికి ఎగబాకేలా పెంచేసింది. అయినా.. మద్య వినియోగం ఆగలేదు. కానీ, ప్రభుత్వానికి మాత్రం బ్యాడ్‌నేమ్ వచ్చేసింది. నిషేధం అన్న ప్రభుత్వం ఇలా చేయడం ఏంటని.. ప్రశ్నలు కూడా వచ్చాయి. మరోవైపు.. సంప్రదాయ బ్రాండ్లను పక్కన పెట్టి.. పిచ్చి పిచ్చి లోకల్ బ్రాండ్లను ప్రజలతో తాగించారనే వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నందున.. మద్యం పాలసీపై సర్కారు యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం తమ చేతుల్లోనే మద్యం దుకాణాలు ఉన్నందున.. ఈ అపవాదులు వస్తున్నాయని.. కాబట్టి..తాము తప్పుకొని.. మళ్లీ ప్రైవేటుకే మద్యం అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహిస్తున్న దుకాణాలకు త్వరలోనే టెండర్‌లు పిలిచి.. వాటిని అప్పగించేయనుంది. ఇలా చేయడం ద్వారా.. రెండు ప్రయోజనాలను వైసీపీ సర్కారు లెక్కలు వేసుకుంటోంది.
ఒకటి ప్రజల్లో తమపై అపవాదును పోగొట్టుకోవడం.. ఎన్నికలకు ముందు లబ్ధి పొందే ప్రయత్నం చేయడం.. రెండు.. మరింత ఎక్కువగా ఆదాయం రాబట్టడం. ప్రస్తుతం ప్రతిపక్షాలు జోరుగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. దీనిని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. రెండోది.. 25 వేల కోట్లుగా ఉన్న ఆదాయాన్ని ప్రైవేటుకు అప్పగిస్తే.. 40 వేల కోట్లకు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. తద్వారా.. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి నుంచి అంతో ఇంతో ఉపశమనం లభిస్తుంది. ఇలా.. జగన్ సర్కారు మద్యంపై రివర్స్ టెండరింగ్ సూత్రం పాటించడం గమనార్హం.