భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి పాత్ర..!

-

ప్రతి మహిళలో ఉగ్రరూపం దాల్చిన రాణీ లక్ష్మీబాయి ఉంటుంది. శాంతికే కాదు..రౌద్రానికి కూడా ఆడవారు తీసిపోరు. ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి అంటే ధైర్యసాహసాలకు ప్రతీక. బ్రిటీష్‌ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరనారి. పోరాట స్పూర్తికి ఝాన్సీ ప్రతీక. భారత స్వతంత్ర్య సంగ్రామంలో రాణీ లక్ష్మీభాయి పాత్ర తీరే వేరు. ఆంగ్లేయుల గుండెల్లో వణుకుపుట్టించిన వీరురాలు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఆణిముత్యం గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో రాణి లక్ష్మీబాయి (1835-58) పేరు విననివారుండరు. ఝాన్సీ ప్రాంతానికి చెందిన ధైర్యసాహసోపేతురాలైన మహారాణి ఆమె. పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిషు వారి పాలనను ఎదిరించిన వీరనారి ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి… బ్రిటిషు వారిపై భారతీయుల పోరాట స్ఫూర్తికి ఝాన్సీ లక్ష్మీబాయి ఓ ప్రతీక. వారణాసిలో మోరోపంత్‌ థాంబేకు ఆమె జన్మించారు. మణికర్ణిక (మను) అనేది ఆమె చిన్నప్పటి పేరు. అప్పట్లో చిన్న మరాఠా సంస్థానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధర రావుకు ఆమెను ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన తరువాత ఆమె లక్ష్మీబాయిగా పేరొందింది. వారసులెవరూ లేకుండానే గంగాధరరావు మరణించాడు. చనిపోవడానికి ముందు దామోదర్‌ అనే మగ శిశువును ఆయన దత్తత తీసుకున్నాడు.
లార్డ్‌ డల్‌హౌసీ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉండేరోజుల్లో… దామోదర్‌ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజ ప్రతినిధిగా అంగీకరించడానికి డల్‌హౌసీ నిరాకరించాడు. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ సంస్థానాన్ని బ్రిటిషు సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. రాణి లక్ష్మీబాయికి అయిదు వేల రూపాయల చిన్న మొత్తాన్ని భరణంగా ఇచ్చేవాళ్లు…అయితే, ఈ అగౌరవాన్ని, పరాయి వారికి లోబడి ఉండవలసి రావడనాన్నీ రాణి లక్ష్మీ బాయి జీర్ణించుకోలేక పోయింది. ఝాన్సీ సంస్థానాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరాదని దీక్ష పూనింది. ఆ తరువాత కొద్ది కాలానికే అసలు సిసలు మరాఠా మహారాణిగా బ్రిటీషు వారితో పోరాడే అవకాశం వచ్చింది..
1857 మే నెలలో మీరట్‌, ఢిల్లీలలో సిపాయిలు బ్రిటీషు అధికారులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ విధంగా భారతదేశంలో బ్రిటీషు వారిపై పోరాటం ప్రారంభమైంది. అక్కడ నుంచి అది ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. కాలక్రమంలో ఝాన్సీలో కూడా తిరుగుబాటు తలెత్తింది. ఝాన్సీ సంస్థానమంతటా రాణి లక్ష్మీ బాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటీష్‌ జనరల్‌ హ్యూ రోజ్‌పై పోరాటం సాగిస్తూ, రాణి లక్ష్మీబాయి తమ ఝాన్సీ కోటను ధైర్యంగా సంరక్షించింది.. అయితే, తన పరిస్థితి అపాయకరంగా మారుతోందని గమనించిన ఆమె బ్రిటీషు సేనల్ని కల్పి ప్రాంతం దగ్గర నిలువరించింది.
మరో స్వాతంత్య్ర సమర యోధుడు తాంతియా తోపే అక్కడ ఆమెతో చేతులు కలిపాడు. ఇంకేముంది.. సిపాయిలను సైన్యంలో చేర్చుకుంటూ, రాణి లక్ష్మీబాయి స్వయంగా పోరాటంలో పాల్గొంది. అయితే, బ్రిటీషు వారు యమునా నదీ తీరంలో కల్పి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపేలు ఇద్దరూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. దాంతో, తిరుగుబాటు ఆగి పోయిందని బ్రిటీష్‌ జనరల్‌ రోజ్‌ భావించాడు. అయితే, ప్రసిద్ధ గ్వాలియర్‌ కోటను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా లక్ష్మీబాయి, తాంతియా తోపేలు బ్రిటీషు వారిని అదిరిపడేటట్లు చేశారు. గ్వాలియర్‌ మహారాజు కోట వదిలి పారిపోవడంతో…ఆయన బలగాల్లో అత్యధిక భాగం రాణి లక్ష్మీబాయి పక్షం వచ్చేశాయి. దెబ్బతిన్న బ్రిటీషువారు గ్వాలియర్‌ కోటపై ఒక్కసారిగా దాడి చేశారు. అంతే..లక్ష్మీబాయి శౌర్య పరాక్రమాలు ప్రదర్శిస్తూ తీవ్ర పోరాటం సాగించినప్పటికీ, ఆ యుద్ధంలోనే తుది శ్వాస విడిచారు. ఆ విధంగా తన ఇంటికి సుదూర ప్రాంతంలో అసువులు బాసిన ఝాన్నీ ఆ పోరాటంలో సంఖ్యాపరంగానూ, ఆయుధాల విషయంలోనూ బ్రిటీషువారిది పైచేయి కావడంతో లక్ష్మీబాయి ఓటమి పాలయ్యారు.
బ్రిటీష్‌ సైన్యాన్ని ఎదిరిస్తూ, ఝాన్సీ లక్ష్మీబాయి చూపిన ధైర్య సాహసాలు, బలపరాక్రమాలు, సామర్థ్యం భారతీయులెవరూ ఇప్పటికీ మర్చిపోలేరు. భారతావనిలో పరాయి పాలనపై పోరాటానికి ప్రతీకగా ఆమె చిరస్మరణీయురాలు. నాలుగు ముక్కల్లో చెప్పతరం కానిది ఆమె చరిత్ర..ఒక్కో ఘట్టం ఒక్కో యుద్ధమే..ఆసక్తి ఉన్నవారు అంతర్జాలం సాయంతో పూర్తిగా తెలుసుకుంటే.. ఎంతోకొంత ఉపయోగపడుతుంది. ఆడవారిలోనూ ధైర్యం ఉండాలి, అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు.. పోరాడాలి, ఎదురుతిరగాలి, ప్రశ్నించే సత్తువ ఉండాలని రాణీ ఝాన్నీ లక్ష్మీభాయి చరిత్ర మనకు చెప్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news