పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటన పై సీఎం వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
అటు ఈ బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరి పరిస్ధితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్ హరిచందన్ సహాయ చర్యలు వేగవంతం చేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలన్నారు. కాగా బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.