మరో వివాదంలో చిక్కుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి… ఈసారి వేటు పడేనా?

-

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ప్రమాణం చేయించగా, అందుకు డబ్బులు ఇస్తామని ఎమ్మెల్యే ఓ సామాజిక వర్గం ప్రజలతో చెప్పించారు. హుజురాబాద్‌లోని కమలాపూర్‌లో ఎమ్మెల్యే చేసిన పనిపై కొందరు మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి చల్లా చిక్కుల్లో పడ్డారు. అదేంటంటే..

పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కొద్ది రోజులు జిల్లా సాధన సమితి ఉద్యమం చేస్తున్నది. ఈ క్రమంలో ఆ సమితి నేతలతో ఎమ్మెల్యే చల్లా సమావేశమయ్యారు. ఈ క్రమంలో మీటింగ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళితుల పట్ల వివక్ష చూపారని మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. సోషల్ మీడియాలోను ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..దళిత సామాజికవర్గానికి చెందిన ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ సిలువేరు సమావేశంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి వెనకాల చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో వీటిని ఆధారాలుగా సమర్పిస్తూ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఏఐసీసీ నేత బక్క జడ్సన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఓ వైపు దళిత సమాజానికి న్యాయం చేస్తానని చెప్తూ ‘దళిత బంధు’ పేరిట సీఎం స్కీమ్ తెస్తుంటే, మరో వైపున అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దళితుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని కొందరు పేర్కొంటున్నారు. ఇకపోతే గతంలోనూ దళితుల పట్ల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ అధిష్టానం ఈసారి ఎమ్మెల్యే చల్లాపై వేటు వేసేందుకు సిద్ధమవుతుందో? లేదో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version