ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ 25 రోజులకు చేరింది. అత్యంత బలమైన రష్యా ముందు కేవలం రెండు మూడు రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నా… ఉక్రెయిన్ బలగాలు రష్యన్ ఆర్మీని ఎదురించి పోరాడుతున్నాయి. దీంతో రష్యా భీకరమైన దాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, ఖార్కీవ్, మరియోపోల్, ఎల్వీవ్ వంటి ప్రధాన పట్టణాలతో సహా 8 నగరాలపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు.
రష్యా దురాక్రమణ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 115 మంది చిన్నారులు మృతి చెందారు. 140 మంది గాయపడ్డారని ది కీవ్ ఇండిపెండెంట్ తెలిపింది. రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్ లోని అనేక నగరాలపై విచక్షణారహితంగా క్షిపణులు, హైపర్ సోనిక్ మిస్సైళ్లతో దాడులు చేస్తోందని యూఎస్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు రష్యా దాడుల వల్ల మరియోపోల్ నగరం ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టుకుని పోతుందని బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే నాలుగు దఫాలుగా రష్యా-ఉక్రెయిన్ చర్చలు జరిపినా.. ప్రయోజనం లేదు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు ఆకలి, దప్పికలతో తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.