తెలంగాణలో రేవంత్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే…ఓ వైపు అధికార టీఆర్ఎస్ ని గట్టిగా టార్గెట్ చేస్తూనే…మరోవైపు బీజేపీని కూడా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. సమయం, సందర్భం బట్టి ఓ సారి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే..మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా రేవంత్…బీజేపీపై పోరాటం మొదలుపెట్టారు.
తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నడిచింది..రేవంత్ తో సహ పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి.. నల్లజెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే సోనియాగాంధీని ఈడీ విచారించడం కక్ష సాధింపు చర్యేనని, కాంగ్రెస్తో పెట్టుకోదలుచుకుంటే రాంలీలా మైదానంలో తేదీ నిర్ణయించండి.. మీరో మెమో తేల్చుకుందామని రేవంత్…మోదీకి సవాల్ విసిరారు.
అయితే ఈ విధంగా రేవంత్…బీజేపీపై పోరాటం చేస్తున్నారు…ఇక ఇదే సీన్ 2019 ఎన్నికల ముందు ఏపీలో కూడా కనిపించింది…కాకపోతే అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి…కేంద్రంలోని మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ధర్మపోరాట దీక్షలు, సిబిఐ, ఈడీ దాడులకు వ్యతిరేకంగా అప్పుడు టీడీపీ హడావిడి చేసింది. అసలు చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు నల్ల చొక్కాలు ధరించి…నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శిస్తూ…పోరాటం చేశారు.
కానీ ఆ పోరాటం పూర్తిగా వృధా అయిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో బాబు చిత్తుగా ఓడిపోయారు…మోదీ సర్కార్ పై చేసిన పోరాటం పూర్తిగా రివర్స్ అయింది. అయితే ఇప్పుడు రేవంత్ సైతం అదే నల్ల చొక్కాల ఫార్ములాతో ముందుకెళుతున్నారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. మరి రేవంత్ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.