గ్రేటర్ లో టీఆర్ఎస్ వర్గాల మధ్య కోల్డ్ వార్

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మొన్నటి వరకు సఖ్యంగానే ఉన్న నేతల మధ్య పూడ్చుకోలేని గ్యాప్ ఏర్పడిందట. స్థానిక ఎమ్మెల్యేకి మంత్రి అల్లుడికి మధ్య కంటోన్మెంట్ ఎన్నికలు చిచ్చుపెట్టాయన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లోనే నడుస్తుంది. గ్రేటర్ తరహాలోనే కంటోన్మెంట్ పరిధిలో ప్రత్యేక పాలకమండలి ఉంటుంది. వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీల హడావిడి మొదలైంది. అయితే ఈ సందడి టీఆర్‌ఎస్‌లో కొత్త పేచీలకు దారి తీస్తున్నట్టు తెలుస్తుంది.


లోకల్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని.. మంత్రి మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి కంటోన్మెంట్‌లో దూకుడుగా వెళ్తున్నట్టు సాయన్న మండిపడుతున్నారట. ఇది కాస్తా అధికార పార్టీ నేతల మధ్య దూరం పెంచుతోందని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను మంత్రి, ఆయన అల్లుడు కానిచ్చేస్తున్నారట. మాట మాత్రంగా కూడా సాయన్నకు చెప్పడం లేదన్నది ఎమ్మెల్యే వర్గీయులు చేసే ఆరోపణ. బోర్డు మెంబర్లుగా పనిచేసిన వారు.. టికెట్‌ ఆశిస్తున్న నాయకులు.. స్థానిక ఎమ్మెల్యేను కాదని.. ఉదయాన్నే మంత్రి, మంత్రిగారి అల్లుడి దగ్గరకు వెళ్లి హాజరు వేయించుకుంటున్నారట. దీంతో సాయన్నను ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

కంటోన్మెంట్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు సాయన్నకు అస్సలు మింగుడు పడటం లేదని సమాచారం. ఒకవేళ ఇంఛార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డితో వేదిక పంచుకోవాల్సి వచ్చినా సాయన్న అన్యమనస్కంగానే ఉంటున్నారట. ఏదైనా సభలో మాట్లాడాల్సి వస్తే.. రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఏడు నియోజకవర్గాల ఇంఛార్జ్‌ అని కాస్త నొక్కి పలుకుతున్నారట ఎమ్మెల్యే. తన మనసులోని అసంతృప్తిని ఈ విధంగా సాయన్న బయట పెడుతున్నారని టాక్‌. ఇంఛార్జ్‌ రాజశేఖర్‌రెడ్డికి పార్టీలోని పెద్దలతో సత్ససంబంధాలు ఉండటం.. బకాయిల విడుదలలో చొరవ తీసుకున్నారని ప్రచారం జరుగుతుండటంతో.. అంతా ఆయన దగ్గరకే వెళ్తున్నారట. ఈ ప్రచారం దెబ్బకు సాయన్న శిబిరంలోని అనుచరుల్లో సైతం కొందరు మనసు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

కామ్‌గా ఉంటే తన సీటుకే ఎసరు పెడతారని భావించారో ఏమో… ఆరోగ్యం సహకరించకపోయినా.. మంత్రి, మంత్రిగారి అల్లుడు దూకుడు చూసిన తర్వాత సాయన్న సైతం పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారట. మరి.. కంటోన్మెంట్ టీఆర్‌ఎస్‌లో మొదలైన కొత్త పేచీలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news