రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా 970 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను పోలీసులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఈ చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు పేర్కొన్నారు. మెడికో ప్రీతి మరణానికి సీనియర్ సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు అభియోగాలు మోపారు. సైఫ్ కులం పేరుతో ర్యాగింగ్ చేయడం వల్లే మెడికో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ప్రీతి వరంగల్ కేఎంసీలో చేరినప్పటి నుండే సైఫ్ వేధించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికి 70 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారు.
సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు, నిందితుడు, వారి మిత్రులు వాడిన సెల్‌ఫోన్‌ల డేటాను వెలికి తీసి.. మృతురాలు మరణంపై కేసుకు సంబందించిన అన్ని రకాల సాక్ష్యధారాలు సేకరించి.. అన్ని పరిశీలించిన తర్వాత విచారణలో మెడికో ప్రీతిని డాక్టర్ ఎంఏ సైఫ్ ర్యాగింగ్ పేరుతో వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడని రుజువు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు.