ఫస్ట్‌కాజ్ : కర్నూలు వైద్యాలయంలో మూడంటే మూడు రోజుల్లో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు..దేశంలోనే అరుదైన రికార్డు.
సర్కారు వైద్యం అంటే చిన్న చూపు వద్దే వద్దు అని అంటారు సీఎం. ఆ విధంగా సర్కారు వైద్యం పై ఉన్న భ్రమలు కూడా తొలగింప జేసేందుకు ఎప్పటికప్పుడు సర్కారు ఆస్పత్రి సేవలు విస్తృతం చేయాలని, కొత్త విజయాల నమోదుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆయన. అందుకనే ఏటా బడ్జెట్ లో మొదటి ప్రాధాన్యం వైద్యం, విద్య.. ఈ రెండు రంగాలే !ఆయన స్ఫూర్తి అందుకుని కర్నూలు వైద్యాలయం అరుదైన రికార్డు నెలకొల్పింది.ఆ వివరం ఈ కథనంలో..
సీమ వాకిట మరో మంచి పరిణామం చోటుచేసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన వచ్చిన వేళా విశేషాన ఆయన అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం పుణ్యమానికి ఒక వారంలో కేవలం మూడు రోజుల్లో ఏడు బైపాస్ సర్జరీలు జరిగేయి. ఇందుకు ఆ కర్నూలు ఆస్పత్రి ప్రాంగణం ఎంతగానో ఆనందిస్తోంది. ఎందుకంటే వాళ్లంతా నిరుపేదలు.
ఖరీదయిన వైద్యం చేయించుకోలేని పేదలకు ఎంతో అండగా నిలిచిన వైనంపై కర్నూలు ఆస్పత్రి డిప్యూటీ సూపరిండెంట్, కార్డియో థోరాసిక్ సర్జన్ చింతా ప్రభాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనే ఈ ఏడు ఆపరేషన్లూ చేసి ఆ ఏడుగురి ప్రాణాలు నిలిపి, ఇప్పుడీ ఆనంద దాయక పరిణామాలకు కారణం అయింది. అందుకే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సైతం ఆ వార్త విని డాక్టర్ కు అభినందనలు తెలిపారు. వైద్యాలయం అందిస్తున్న సేవలకు ఎంతగానో మురిసిపోతున్నారు పేద ప్రజలు కూడా !
కరోనా కాలంలోనూ..
విపత్కర సమయంలోనూ ఆయన ఎంతగానో శ్రమించి పనిచేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా కావడంతో ప్రభాకర్ రెడ్డి మరింత విస్తృత రీతిలో సేవలందించారు. ఇప్పుడు అనే కాదు గతంలోనూ ఆయన కొన్ని ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వైద్యారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. నాటి వైఎస్సార్ నుంచి నేటి జగన్ వరకూ ఆరోగ్య శ్రీ అమలుకు సంబంధించి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించి, సేవలను వినియోగించుకోవాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి ఇవాళ.