హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో దారుణం జరిగింది. కోల్కా గ్రామంలోని గోవింద్ సాగర్ సరస్సులో మునిగి ఏడుగురు యువకులు మరణించారు. వీరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?
పంజాబ్‌కు చెందిన ఏడుగురు యువకులు హిమాచల్‌ప్రదేశ్ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఉనా జిల్లాలోని నైనా దేవి ఆలయాన్ని సందర్శించాలనుకున్నారు. ఉదయాన్నే అందరూ కలిసి ఆ ఆలయం వద్దకు వెళ్లారు. అయితే గుడిలోకి వెళ్లే ముందు కోనేరులో పుణ్యస్నానం చేయడం పరిపాటి. అందుకే ఆ యువకులు అక్కడు ఉన్న గోవింద్ సాగర్ సరస్సులో పుణ్యస్నానం చేయాలనుకున్నారు.
ముందుగా సరస్సులోకి ఏడుగురు యువకుల్లో ఒక యువకుడు దిగాడు. అతడు నీటిలో కాస్త ముందుకెళ్లగానే.. అతడు మునిగిపోయాడు. వెంటనే కాపాడడానికి ఆరుగురు ముందుకెళ్లారు. దురదృష్టవశాత్తు అందరూ ఆ సరస్సులో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను సరస్సు నుంచి బయటకు తీశారు. శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.