ప్రస్తుతం ట్రెండ్ అంతా చిన్న సినిమాలదే నడుస్తోంది. కొత్త హీరో హీరోయిన్లతో సరికొత్త కథలతో ఫ్రెష్‌గా తెరకెక్కిస్తోన్న సినిమాలకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. కరోనా తర్వాత ఆడియెన్స్ మైండ్ రీసెట్ అయింది. ఓటీటీల్లో ఇతర భాషల కంటెంట్ చూసిన ప్రేక్షకులు.. అప్పటి నుంచి తెలుగులోకూడా కంటెంట్ ఉన్న మూవీస్‌కే జై కొడుతున్నారు. ఇప్పుడు సినిమా చూడాలంటే డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఎవరో అక్కర్లేదు.. ఆ మూవీలో కంటెంట్ ఉందా లేదా అన్నదే మ్యాటర్.
అందుకే కంటెంట్ లేని పెద్దపెద్ద స్టార్ల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతున్నాయి. ఏ మాత్రం హైప్ లేకుండా సైలెంట్‌గా థియేటర్లలోకి వస్తోన్న చిన్న సినిమాలు ఏకంగా వంద కోట్ల క్లబ్‌లలో చేరుతున్నాయి. అలాంటి చిన్నసినిమాల్లో ఒకటే హైదరాబాద్ యువకుడు శ్రీరామ్ నిమ్మల నటించిన మది. ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైన ఈ మూవీ మరి ప్రేక్షకులన మదిని దోచిందా లేదా చూడండి.
ఇదీ స్టోరీ : అభిమన్యు(శ్రీరామ్ నిమ్మల), మధు(రిచా జోషి) ఇద్దరు ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటారు. ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అలా సాఫీగా సాగిపోతున్న వారి లవ్‌స్టోరీలో కులం అనే విలన్ ఎంట్రీ ఇస్తుంది. ఇంకేంటి మధు వాళ్ల నాన్న వారి కులంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి తన పెళ్లి చేసేస్తాడు. హీరోయిన్ పెళ్లైపోతే ఇంక సినిమా ఏంటి అనుకుంటారేమో అదే ఈ మూవీలో ట్విస్ట్. మధుకి పెళ్లయినా అభి-మధులు వాళ్ల లవ్‌స్టోరీని అలాగే కంటిన్యూ చేస్తారు. మరి వీళ్లిద్దరి లవ్‌స్టోరీ చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. ప్రేమ, విరహం, ప్రళయం ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ మూవీకి ట్యాగ్‌లైన్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. మధుతో ప్రేమలో పడ్డ అభి ప్రపంచాన్నే మరిచిపోతాడు. ఈ లోకంలో వాళ్లిద్దరు తప్ప ఇంకెవరూ లేరన్నట్లు.. అవసరం కూడా లేదన్నట్టు వాళ్ల లోకంలో విహరిస్తూ ఉంటారు. అదే సమయంలో విలన్ ఎంట్రీ అదేనండీ కులం ప్రస్తావన. అభి-మధుల కులాల వేరు కావడంతో మధు తండ్రి తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలనకున్నాడు. ఆ సమయంలో ఇద్దరు భగ్నప్రేమికుల విరహం ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక మధుకు పెళ్లయిన తర్వాత అభి-మధుల జీవతాల్లో వచ్చే ప్రళయం. ఆ ప్రళయానికి ఎదురొడ్డి ఇద్దరూ తమ ప్రేమకథ కొనసాగించడం ఇది ఈ సినిమాను మిగతా రొటీన్ లవ్‌స్టోరీల నుంచి వేరు చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా అందరి లవ్‌స్టోరీల్లాగే స్వీట్‌గా సాగుతుంది. సెకండాఫ్ వచ్చేసరికి కథలో కాస్త సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో అభి-మధుల లవ్‌స్టోరీ చూసిన ప్రతి యువతీ యువకుడు అరె.. ఇది మన స్టోరీలాగే ఉందని ఫీల్ అవుతారు. ఇక ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్‌కు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. మూవీలో క్లైమాక్స్ సీన్స్ హైలెట్. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్లే ఉన్నాయనిపిస్తూనే ఊహించని విధంగా కథను ముగించిన తీరు మెప్పిస్తుంది.
యాక్టింగ్ ఎలా చేశారంటే..: శ్రీరామ్ నిమ్మల.. ఈ హైదరాబాదీ కుర్రాడి నటనకు ప్రేక్షకులు తప్పక ఫిదా అవ్వాల్సిందే. ఫస్ట్ హాప్‌లో కూల్‌గా, హ్యాపీ బాయ్‌ఫ్రెండ్‌గా ఉండే శ్రీరామ్.. సెకండాఫ్‌లో హార్ట్ బ్రేక్ అయిన ఓ భగ్న ప్రేమికుడిగా నటించిన తీరు ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో శ్రీరామ్ చెప్పే డైలాగులు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. లవ్‌లో ఫెయిల్ అయిన యువకులు తమ మనసులోని మాటలే శ్రీరామ్ చెబుతున్నాడనిపించేంత కనెక్ట్ అవుతారు సినిమాకు. రిచా జోషి పక్కింటమ్మాయిలా అందంగా కనిపిస్తూనే.. ప్రేమించిన వాడికోసం ఎన్ని హద్దులైనా దాటేయగల పాత్రలో చక్కగా నటించింది. టెక్నికల్ పరంగా ఈ మూవీ చాలా బాగుంది.
నాగ ధనుశ్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లై కాస్త స్లోగా సాగినట్టు అనిపించినా అభి-మధుల వచ్చే ప్రేమ, సంఘర్షణ సన్నివేశాలు ప్రేక్షకులు కథ నుంచి బయటకు రాకుండా సినిమాకు కట్టిపడేస్తాయి. సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం చేకూర్చింది. ఎమోషనల్ సీన్లలో డైలాగ్‌కు బీజీఎం గుండెలకు హత్తుకునేలా ఉంది.
నటులు : శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్, యోగి ; దర్శకుడు : నాగధనుష్ ; నిర్మాత : రామ్‌కిషన్ ; మ్యూజిక్ డైరెక్టర్ : పీవీఆర్ రాజా స్వరకర్త.
రేటింగ్ : 2.5/5
కన్‌క్లూజన్ : హ్యాపీ ఎండింగ్.. సాడ్ ఎండింగ్ అని ఆలోచించకుండా ఓ ఫీల్‌గుడ్ రియల్‌టైమ్ లవ్ స్టోరీ చూడాలంటే మది మూవీకి వెళ్లాల్సిందే
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!