ఆప్గన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతూనే ఉంది. మైనారీటీలకు ఎలాంటి అపాయం కలిగించమనే వారి హామీలు నీటిమూటలే అవుతున్నాయి. తాజాగా ఆప్గన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా కర్తే పర్వాన్ పై కొంతమంది అనుమానిత తాలిబన్ ఫైటర్లు దాడి చేశారు. ఆప్గన్ సిక్కుల కథనం ప్రకారం ఆయుధాలు ధరించిన కొంతమంది తాలిబన్లు గురుద్వారాను ధ్వంసం చేశారని వెల్లడించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు తాళాలు వేసిన డోర్లను పగలగొట్టారని వెల్లడించారు. ఆప్గన్లో అధికారాన్ని చేపట్టిన తాలిబన్లు గతంలో ఆప్గన్ లోని సిక్కులు, హిందూ మైనారీటీలకు ఎటువంటి హాని కలుగనీయబోమని చెప్పారు. తాజాగా జరిగిన సంఘటనతో ఆప్గన్లోని మైనారిటీలు మరింతగా కలవరపడుతున్నారు. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో అని బిక్కుబిక్కుమంటూ బ్రతుకీడుస్తున్నారు. గతంలో దాదాపు 240 మంది ఆప్గన్ సిక్కులను, హిందువులను భారత ప్రభుత్వం భారత్ కు తరలించింది.