తెలంగాణలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహిస్తోందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన తన స్థాయిని మరిచి పరుషజాలంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మేం తప్ప ఎవరూ అధికారం చెలాయించవద్దనే ధోరణితో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
పద్నాలుగేళ్ల పాటు అహింసా పద్ధతిలో పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. కేసీఆర్‌ను వ్యూహాత్మకంగా ఢీకొట్టలేక హింసాత్మక సంఘటనలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందన్నారు. అందుకే తమ పార్టీకి చెందిన మెదక్ ఎంపీపై నిన్న కత్తితో దాడి జరిగిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ 14 స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. ప్రతిపక్షాల్లో గెలుస్తామనే విశ్వాసం సన్నగిల్లిందన్నారు.