వైసీపీలో ‘వివాదాలు-విభేదాలు..ఆ ఎమ్మెల్యేల రూటే సెపరేట్.!

-

వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశం అవుతుంది. కొందరు మాట్లాడే వివాదాలు రాజేస్తున్నాయి. అలాగే కొందరు ఎమ్మెల్యేలు అసమ్మతి సెగలు చూపిస్తున్నారు. దీని వల్ల అధికార వైసీపీలో కాస్త ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి. మామూలుగా వైసీపీ ఎంతటివారైనా సరే పరిధి దాటి వెళ్లరని, జగన్ గీసిన గీత దాటరని అంటుంటారు.

కానీ ఇప్పుడు పరిస్తితులు చూస్తే దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు గళం విప్పుతున్నారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వారి డిమాండ్లని వినిపిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గుంతలు పూడ్చకుండా, కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా, ఇళ్ళు కట్టకుండా ప్రజలని ఎలా ఓటు అడుగుతామని అన్నారు. పెన్షన్లు, పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కొన్ని పెన్షన్లు తొలగించడంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీరే కాదు..ఇంకా కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.

 

ఇక తాజాగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వి‌ఆర్‌ఓ, వి‌ఆర్‌ఏ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న వీఆర్‌వో, వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతోందని సంచలన కామెంట్లు చేశారు. రెవెన్యూ శాఖలో వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థలు అవినీతికి చిహ్నంగా మారాయని,  వీఆర్‌వోలను సచివాలయ కార్యదర్శులుగా.. వీఆర్‌ఏలను అర్హతలను బట్టి అటెండర్లు, ఇతర ఉద్యోగాల్లో నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీతో జగన్ సఖ్యతగా ముందుకెళుతుంటే.. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అందరూ సిద్ధం కావాలని చెన్నకేశవ పిలుపునిచ్చారు. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, అదే సమయంలో దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసించారు. మొత్తానికి వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు వివాదాలు సృష్టించడంలో ముందున్నట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news