అవును! ఇప్పుడు ఈ మాట టీడీపీ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో నైరాశ్యం ఏర్పడిందని.. సీనియర్లు సైతం భయపడి పోతున్నారని, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. పార్టీ అధినేత చంద్రబాబు కూడా డైలమాలో పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఫుల్లుగా దెబ్బతింది. ఎక్కడికక్కడ కంచుకోటను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కూలగొట్టారు. కీలకమైన నియోజకవర్గాల్లో కీలకమైన నాయకులు కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
ఇలాంటి పరిస్థితికి తోడు.. చంద్రబాబు తప్ప పార్టీని నడిపించే యోధుడు టీడీపీలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాయకులు ఎవరికి వారు తప్పుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. తప్ప.. పార్టీని డెవలప్ చేసుకునేందుకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పోనీ.. ఉన్నవారికైనా పార్టీ నైతిక స్థయిర్యం లభిస్తోందా? అంటే.. అది కూడా సాధ్యం కావడంలేదు. ప్రస్తుతం ఈఎస్ ఐ కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం, ఆయనను జైలుకు తరలించడం తెలిసిందే.
దీనిపై ఆదిలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఏమీ లేనిది .. అచ్చెన్నపై ఎందుకింత కోపం.. కావాలనే కేసులో ఇరికించారు.. ఆయనను జైలుకు పంపారని అన్నారు. ఇక, మరో మంత్రి కొల్లు రవీంద్ర ఏకంగా హత్య కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. ఈయన విషయంలో చంద్రబాబు రాజకీయంగా మైలు రాయి సాధించేందుకు ప్రయత్నించారు. కావాలనే కొల్లును ఇరికించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు వాదనను ఎల్లో మీడియా కూడా బాగానే ప్రోజెక్టు చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఇద్దరికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయి. తనకు ఆరోగ్యం బాగోలేదని, తనను ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వేధిస్తోందని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై హైకోర్టు ఆదిలో సీరియస్ అయినా.. చివరాఖరుకు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇది వ్యక్తిగతంగా అచ్చెన్నాయుడికి దెబ్బే అయినా… సంస్థాగతంగా చూసుకుంటే.. టీడీపీకి భారీ దెబ్బ అంటున్నారు పరిశీలకులు. పార్టీలో సీనియర్లను కాపాడుకోలేక పోతున్నారనే అపవాదు, కనీసం నేతలకు బెయిల్ కూడా ఇప్పించుకోలేక పోతున్నారనే ఒత్తిళ్లు ఆయనపై పెరుగుతున్నాయి.