సెక్యులర్ వ్యవస్ధలో మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. రాజ్యాంగంలో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణంపై ఎలా తీర్మానం చేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. అసెంభ్లీలో దళిత క్రైస్తువులకు షెడ్యూల్ కులాలకిచ్చే రిజర్వేషన్లు వర్తింప చేసే విధంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోందన్నారు. ఇటువంటి అంశాలపై వైసీపీ కనీసం అఖిలపక్షంతో కూడా చర్చించకుండా ఏక పక్షంగా తీర్మానం చేయడ రాజకీయ ప్రయోజనమేనని, రాజ్యాంగ బద్దంగా కల్పించిన రిజర్వేషన్లకు భిన్నంగా ఏపీ అసెంభ్లీ తీర్మానం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా విభేదిస్తోందన్నారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వంపై చార్జ్‌షీటు దాఖలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని కింది స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఏప్రిల్ 17 నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశామన్నారు. ప్రధానమంత్రి మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు శిక్ష విధించిందన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగిందన్నారు.