వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుందని, వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యేలు గుర్తించకున్నా.. పార్టీ గుర్తిస్తుంది. పార్టీ కోసం పని చేసే వారే నా ఆప్తులు.. వారికే ప్రాధాన్యత. రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో.. టీడీపీ కుటుంబ సభ్యులను కూడా బాగుచేయడం అంతే ముఖ్యం. అధికారం వస్తే.. మమ్మల్ని పట్టించుకోరనే అనుమానం కొందరిలో ఉంది. గతంలో నేను కార్యకర్తలను ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవం.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి.. అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయా. ఈసారి కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాం.. ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యమన్నారు. అంతేకాకుండా.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ తనపై చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంటులో ఏదో జరిగిందని కొత్త రాగం తీస్తున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సీమెన్స్ ఒప్పందం జరిగిందో తెలుసా..? షెల్ కంపెనీలు పెట్టుకుంది జగన్.. ఆయన భార్యే. తమిళనాడులో షెల్ కంపెనీలు పెట్టుకుంది ఎవరు..? స్కిల్ స్కాం జరిగిందని.. బ్యాంకు ఖాతాల్లోకి నగదు వెళ్లిందని ఆరోపిస్తున్నారు. ఎవరి ఖాతాల్లోకి నగదు వెళ్లిందో చెప్పు జగన్ రెడ్డి..? డిజిటల్ కరెన్సీ వస్తే మోసాలు జరగవని ప్రధానికి చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. అవినీతి ఉండకూడదని సలహాలు ఇచ్చిన వ్యక్తిని నేను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తప్పు చేయదు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.