తిరుపతి ఉపఎన్నికలో పాటల పంచాయితీ కొత్త మలుపు తిరిగిందా !

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో పాటల గోల కొత్త మలుపు తిరుగుతుంది. ఒకే ట్యూన్‌తో పాడిన సాంగ్స్‌ వైసీపీ, బీజేపీ మధ్య వేడి పుట్టిస్తున్నాయి. రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అని సింగర్‌ మంగ్లీ వైసీపీ కోసం ఒక పాట పాడితే..ఇదే ట్యూన్‌లో భారతమాత ముద్దుబిడ్డ మోడీ అంటూ మరో సాంగ్‌ బీజేపీ ప్రచారంలో వినిపిస్తోంది. ఈ రెండు పాటల ట్యూన్‌ ఒక్కటే కావడంతో రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పనికి శ్రీకారం చుట్టేశారు.

ఉప ఎన్నిక ప్రచారంలో ఈ పాఠల వివాదం పై నేతల మాటల యుద్ద కోటలు దాటుతుంది. 2014లోనే మోడీపై ఈ సాంగ్‌ సిద్ధం చేశామన్నది బీజేపీ నేతల వాదన. వైసీపీకి సాంస్కృతిక విభాగమే లేదని.. పాటల గురించి వారికేం తెలుసు.. కరెప్షన్‌.. కలెక్షన్‌ తప్ప అని ఘాటు వ్యాఖ్యలు చేసింది బీజేపీ. బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఉండి సొంతంగా పాట తయారు చేయించుకోలేక వైసీపీ సాంగ్‌ కాపీ కొట్టారని మండిపడుతున్నారు వైసీపీ నాయకులు.

ఈ రెండు పాటల లింకులు ఓపెన్‌ చేస్తే యూట్యూబ్‌లో ఇంకాస్త ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ సాంగ్‌ను ఏడాది క్రితం అప్‌లోడ్‌ చేస్తే మూడున్నర కోట్ల మందికి పైగా చూశారు. బీజేపీ సాంగ్‌ అయితే వేర్వేరు పేర్లతో ఉంది. దానిని కూడా యూట్యూబ్‌లో ఏడాది క్రితమే అప్‌లోడ్‌ చేశారు. కొన్ని లింకుల్లో 3 మిలియన్లు. ఇంకొన్ని లింకుల్లో 5 వేల వ్యూస్‌ ఉన్నాయి. ఈ వివాదంలో ఎవరి వాదన ఎలా ఉన్నా అన్ని పార్టీలు పాటలను బాగానే వాడుకుంటున్నాయి. సొంతంగా పాటలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లేందుకు చూస్తున్నాయి.

ఇక వైసీపీ రాయలసీమ ముద్దుబిడ్డ సాంగ్‌తోపాటు తూర్పు దిక్కుల్లో ఉదయించే సూరీడా పాటను ఎక్కువగా పార్టీ ప్లే చేస్తుంది. ఇది కూడా బాగా పాపులర్‌ అయిన సాంగ్‌. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అనే పాట కూడా 2019 ఎన్నికల్లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్‌ మా తెలుగు తల్లికి మల్లెపూ దండతోపాటు చెయ్యి ఎత్తి జైకొట్టు తెలుగోడా మంచి సక్సెస్ అయ్యాయి. టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాక కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా సాంగ్‌ను రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో రూపొందించారు. అది జనాల్లోకి బాగానే వెళ్లింది.

పాటలు ఎలాఉన్నా పార్టీల లక్ష్యం ఒక్కటే. ప్రచారానికి అవి ఊపు తీసుకొస్తాయి. ప్రజల అటెన్షన్‌ తెచ్చి కేడర్‌ను ఉత్సాహ పరుస్తాయి. కానీ తిరుపతి ఉపఎన్నికలో మాత్రం పార్టీల మధ్య రగడ పాటతో మొదలైంది. రెండు అధికారంలో ఉన్న పార్టీలు కావడంతో ఆ స్థాయిలోనే మాటల దాడి చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news