ప్రస్తుతం జరుగతున్న ఐపీఎల్ సీజన్లో చర్చంతా ధోనీ రిటైర్మెంట్ గురించే. వ్యాఖ్యాతలు, విలేకర్ల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్న.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజనా..? అభిమానుల్లోనూ ఇదే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ధోనీ రిటైర్‌మెంట్ గురించి వస్తున్న ప్రశ్నలపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు.
ప్రతిసారి అదే ప్రశ్నలతో ధోనీని ఉక్కిరిబిక్కిరి చేయడం సరైంది కాదని సెహ్వాగ్ అన్నాడు. ధోనీ కూడా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. వీడ్కోలుకు సంబంధించిన విషయం ఏదైనా అభిమానులకు తెలిసేలా ధోనీనే సరైన సమయంలో ప్రకటిస్తాడని సెహ్వాగ్ తెలిపాడు.
‘‘ప్రతిసారి ధోనీని ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ఇదే అతడికి చివరి సీజన్ అని అనుకుందాం.. మళ్లీ మళ్లీ ప్లేయర్‌నే అడగాల్సిన అవసరం ఏంటి? తుది నిర్ణయం అతడే తీసుకుంటాడు. అభిమానులకు తెలియజేస్తాడు. ‘ఇదే నాకు చివరి సీజన్’ అని ధోనీ నుంచి ఇలాంటి సమాధానం రాబట్టాలని సదరు వ్యాఖ్యాత భావించి ఉంటాడు. ఇది చివరి సీజనా..? కాదా..? అనేది కేవలం ఎంఎస్ ధోనీకి మాత్రమే తెలుసు. అతడే సరైన సమయంలో వెల్లడిస్తాడు’’ అని సెహ్వాగ్ అన్నాడు.