ఐపీఎల్ కోసం డీఆర్ఎస్ సిబ్బందిని కొనేసిన బీసీసీఐ.. పాక్‌-కివీస్ సిరీస్‌కు డీఆర్ఎస్ క‌రువు.. ట్రోల్ చేస్తున్న‌ నెటిజ‌న్లు..

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెల‌ల్లో ముగియాల్సిన ఐపీఎల్ 2021 కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2021 ఐపీఎల్ రెండో ద‌శ టోర్న‌మెంట్ దుబాయ్‌లో జ‌రుగుతోంది. దుబాయ్‌, షార్జా, అబుధాబిల‌లో మ్యాచ్ లు జ‌రుగుతాయి. అయితే ఐపీఎల్ కు అవ‌స‌రం అయ్యే డీఆర్ఎస్ సిబ్బందిని బీసీసీఐ భారీ మొత్తానికి కొనేసింది.

netizen troll pakisthan cricket board

పాకిస్థాన్‌తో క‌లిసి న్యూజిలాండ్ తాజాగా ఓ సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా వారు నియ‌మించుకుందామ‌నుకున్న డీఆర్ఎస్ సిబ్బందిని బీసీసీఐ 4 రెట్లు అధిక మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. దీంతో పాక్‌-కివీస్ సిరీస్‌కు డీఆర్ఎస్ క‌రువైంది. ఈ సిరీస్‌కు డీఆర్ఎస్ ఉండ‌బోద‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్ప‌ష్టం చేసింది.

అస‌లే ప‌లువురు కీల‌క కివీస్ ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో ఆడ‌నుండ‌డంతో పాక్‌-కివీస్ సిరీస్ క‌ళ త‌ప్పింది. ఇక తాజాగా డీఆర్ఎస్ సిబ్బందిని కూడా బీసీసీఐ కొనుగోలు చేయ‌డంతో పాక్‌కు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్ల‌యింది. దీంతో వారు డీఆర్ఎస్ సేవ‌లు లేకుండానే కివీస్‌తో సిరీస్ ఆడ‌నున్నారు.

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక‌మైన క్రికెట్ బోర్డుల‌లో బీసీసీఐ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఐపీఎల్‌ను ప్రారంభించాక మ‌రింత సంప‌న్నంగా బోర్డు మారింది. ఈ క్ర‌మంలోనే డీఆర్ఎస్ సేవ‌ల‌ను పొందేందుకు ఈ సారి బీసీసీఐ ఏకంగా 4 రెట్ల ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తోంది. అందువ‌ల్లే ఫ్యాన్స్ సైతం పాక్ క్రికెట్ బోర్డును ఆట ఆడుకుంటున్నారు. డీఆర్ఎస్ సిబ్బందికి చెల్లించేందుకు డ‌బ్బులు కూడా లేని స్థితిలో పాక్ క్రికెట్ బోర్డు ఉంద‌ని, వారికి ఎవ‌రైనా డ‌బ్బుల‌ను దానం చేయండ‌ని.. నెటిజ‌న్లు పాక్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు.