ఓటమెరుగని కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన రహానె

-

అజింక్యా రహానె.. క్లాస్‌ ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. సౌమ్యుడు..! మైదానంలో కూల్‌గా ఉంటాడు. ఒకానొక సమయంలో టెస్ట్‌ జట్టుకే పరిమితమయ్యాడు. కానీ కీలక సిరీస్‌లో జట్టును ఎలా నడిపించాలో చూపించాడు. 36 పరుగులకే ఆలౌటై ఓడిన జట్టును.. సిరీస్‌ విజేతగా నిలిపాడు. ఓటమెరుగని కెప్టెన్‌గా నిలిచాడు.

టీమిండియాకు కొత్త టెస్ట్‌ కెప్టెన్‌ దొరికాడు. కోహ్లీ లేకున్నా.. టీమిండియా చారిత్రాత్మక విజయాలు సాధించగలని చూపించాడు. అనుభవం లేని బౌలర్లు.. బౌన్సీ పిచ్‌లపై ఎన్నడూ ఆడని కుర్రాళ్లను ఇచ్చినా.. అదరగొట్టాడు. కోహ్లీ సారథ్యంలో 36 పరుగులకు ఆలౌటైనప్పుడు అంతా టీమిండియా పని అయిపోయిందనుకున్నారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. రెండో టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌గా అదరగొట్టిన రహానె.. కెప్టెన్‌గా మూడు సిరీస్‌లోనూ సత్తా చాటాడు.

రెండో టెస్ట్‌ విజయంలో కెప్టెన్‌ రహానెదే కీలక పాత్ర..! తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి జట్టుకు ఆధిక్యానందించాడు. ఇక బౌలింగ్‌లోనూ ప్రణాళికబద్ధంగా వ్యూహాలను అమలు చేశాడు. ముఖ్యంగా బౌలర్లను మార్చడంలో రహానె స్టయిల్‌ అద్భుతమని సీనియర్లు ప్రశంసలు గుప్పించారు. ముఖ్యంగా జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తిని రగిల్చడం.. కుర్రాళ్లకు సరైన రీతిలో గైడ్‌ చూసి సక్సెస్‌ అయ్యాడు. అందుకే ప్రతి మ్యాచ్‌లో అరంగ్రేటం చేసిన ఆటగాడు అద్భుత ప్రదర్శన చేశాడు. అనుభవం లేకున్నా.. ఆస్ట్రేలియాను మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించాడు రహానె.

కెప్టెన్‌గా రహానె ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టించాడు. కెప్టెన్‌గా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచాడు. ఓ మ్యాచ్‌ డ్రా అయింది. అంటే ఓటమెరుగని కెప్టెన్‌ అజింక్యా రహానె. 2017లో ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌తోనే రహానె కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అందులో విజయం సాధించి సిరీస్‌ను డ్రా చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచి సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిపించిన మూడో భారత కెప్టెన్‌ రహానె.

 

Read more RELATED
Recommended to you

Latest news