మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ మసకబార్చుకున్న కేరళ క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి ఐపీఎల్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. తర్వలోనే జరుగనున్న ఐపీఎల్ మెగా వేలం కోసం శ్రీశాంత్.. తన పేరు కూడా నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ – 2022 వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగనుంది. కాగా.. వేలం కోసం తన కనీస ధరను శ్రీశాంత్ రూ.50 లక్షలుగా పేర్కొన్నాడు. గత సీజన్ లో శ్రీశాంత్ కనీస ధర రూ.75 లక్షలు కాగగా.. ఎవరూ అతన్ని కొనుగోలు చేయలేదు.
శ్రీశాంత్ చివరి సారిగా 2013 లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. గతంలో ఐపీఎల్ సందర్భంగా ఫిక్సింగ్ ఊబిలో చిక్కుకున్న శ్రీశాంత్ నిషేధం ఎదుర్కొన్నాడు. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాడు. బీసీసీఐ అతడి పై జీవిత కాలం నిషేధం విధించగా.. 2019 లో సుప్రీం కోర్టు ఆ నిషేధాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిషేధం 2020 సెప్టెంబర్ లో ముగిసింది. ఇక ఇప్పడు దేశ వాలీ మ్యాచ్ లో శ్రీశాంత్ ఆడుతున్నాడు.