శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కనీసం తమ ప్రజలకు పెట్రోల్, డిజిల్ కూడా అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రజలు నిత్యావసరాల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. దేశంలో ఇంధన కొరతతో 15 గంటలకు పైగా కరెంట్ కోతలు ఇలా శ్రీలంక పరిస్థితి ఉంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. దీంతో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే సారథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు.
ఇదిలా ఉంటే ఆసియా కప్ నిర్వహించలేమని చేతులెత్తేసింది శ్రీలంక. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతుండటంతో లంక బోర్డు ఆసియా కప్ ను నిర్వహించలేమంటూ చేతులు ఎత్తేసింది. ఆసియా కప్ వేదిక మార్చాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ను కోరింది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జైషాకు లంకబోర్డు వినతి పత్రాలన్ని అందించింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్ టోర్నీ జరగాల్సి ఉంది.