తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ద్వీపదేశం శ్రీలంక. తాజాగా శ్రీలంకలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సె అత్యవసర పరిస్థితి విధించాడు. దేశ వ్యాప్తంగా కర్ప్యూ కొనసాగుతోంది. మరోవైపు ఆందోళనలు జరగకుండా సోషల్ మీడియాను బ్లాక్ చేసింది.
ఇదిలా ఉంటే నిన్న అర్థరాత్రి అత్యవసర సమావేశం అయింది మంత్రివర్గం. ఈ సమావేశం అనంతరం మొత్తం 26 మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రులు అంతా తమతమ పదవులకు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం తలెత్తనుంది. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సె కుమారుడు నమన్ రాజపక్సె కూడా రాజీనామా చేసిన మంత్రుల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రధాని నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని కూడా రాజీనామా చేస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ… ఇదంతా తప్పుడు ప్రచారం అని పీఎంఓ కార్యాలయం కొట్టిపారేసింది.
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో చిక్కుకుంది శ్రీలంక. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరెంట్ కోతలు, పెట్రోల్ , డిజిల్ కొరతతో తీవ్ర సమస్యల గుడిగుండంలో చిక్కుకుంది శ్రీలంక.