ద్వీపదేశం శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే రాజీనామా చేశారు. ఇప్పటికే ఆందోళనతో శ్రీలంక అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను కట్టడిచేసేందుకు లంక ఆర్మీ టీయర్ గ్యాస్‌ను ప్రయోగించింద. ఇదిలా ఉంటే.. మరో వైపు రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో కొలంబోకు తరలివచ్చిన ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని ముట్టడించారు. నిరసన కారులు శ్రీలంక జండాలు చేబూని హెల్మెట్ లు పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. అనేక మంది శ్రీలంక సైనిక సిబ్బంది కూడా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనకారులతో చేరారు.
నిరసన కారులను కట్టడి చేసేందుకు పోలీసులు గాలులోకి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో నిరసన కారుల నుండి తప్పించుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన నివాసం నుండి పరారయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ విధించగా హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కర్ఫూ ఎత్తివేసింది. దీంతో శనివారం పెద్ద సంఖ్యలో నిరసన కారులు కొలంబోలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.