బాలీవుడ్‌ రేంజ్​ పడిపోవడానికి కారణాలేంటీ?.. అసలేమైందీ?

-

మన దేశంలో ‘పెద్ద సినిమా’ అంటే హిందీ సినిమానే. అక్కడి నటీనటులే ఇండియన్‌ సినిమా స్టార్లు. ఖాన్‌ త్రయం, కపూర్ ఫ్యామిలీ, యాక్షన్‌ హీరోలు అక్షయ్‌, అజయ్‌… వీళ్లే అగ్రతారలు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. దక్షిణాది చిత్రాలు, ఓటీటీ ప్లాట్​ఫామ్​ల జోరు వల్ల బాలీవుడ్‌ వసూళ్ల వేటలో వెనుకబడింది. అక్కడి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే ఇలా జరగడానికి గల కారణాలను తెలిపింది ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక.

బాలీవుడ్
బాలీవుడ్

కరనా ముందు వరకూ జోష్ మీదున్న బాలీవుడ్‌.. ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికలు పుంజుకోవడంతో కష్టాలను ఎదుర్కొంటోందని ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక అభిప్రాయపడింది. ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ నేతృత్వంలోని బృందం బాలీవుడ్‌ పరిస్థితికి కారణాలు తెలుసుకొని కొన్ని సూచనలు చేసేలా ఓ పరిశోధన నిర్వహించింది. “శుక్రవారం బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ రిలీజు రోజులను గుర్తు చేస్తూ: సరికొత్త భారత్‌లోని వీక్షకుల మనస్తత్వాల్లోని మార్పులను మనం చూస్తున్నామా?” అనే శీర్షికన ఈ పరిశోధనను విడుదల చేసింది. దీనిలో హిందీ సినిమాను దెబ్బతీస్తోన్న చాలా అంశాలను ప్రస్తావించింది.

బాలీవుడ్
బాలీవుడ్

ఆ మూవీస్​ నుంచి భారీ కలెక్షన్లు.. కొవిడ్‌ తర్వాత విడుదలైన హిందీ సినిమాల కంటెంట్‌ రెండు వైపులా పదునున్న కత్తి మాదిరిగా ఉంటోందని అభిప్రాయపడింది. ఇది ఆదాయాలపై ప్రభావం చూపుతోందని వెల్లడించింది. సినీ పరిశ్రమకు రెండు ప్రపంచ యుద్ధాలు కూడా చేయలేని నష్టాన్ని కొవిడ్‌ చేసిందని అభివర్ణించింది. కొవిడ్‌కు ముందు బాలీవుడ్‌లో ఏటా సగటున 70-80 చిత్రాలు విడుదలకాగా.. రూ.3,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్ల వరకు వసూళ్లు లభించేవి.

 బాలీవుడ్
బాలీవుడ్

కొవిడ్‌ తర్వాత 2021జనవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కేవలం 61 చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. వీటిల్లో కొన్ని మాత్రమే హిందీలో తీసినవి కాగా.. మిగిలినవి దక్షిణ భారత, ఇంగ్లిష్‌ భాషల నుంచి డబ్బింగ్‌ చేసినవి. మొత్తం చిత్రాలు కేవలం రూ.3,200 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. వీటిల్లో కూడా 48 శాతం వసూళ్లు 18 డబ్బింగ్‌ చిత్రాల నుంచే లభించాయి. వాస్తవంగా హిందీ చలనచిత్ర పరిశ్రమ తీరు అసంతృప్తికరంగా ఉందని ఎస్‌బీఐ పేర్కొంది.

రేటింగ్‌ల్లోనూ నిరాశే.. సినిమాల విజయాలను విశ్లేషించడంలో రేటింగ్స్‌ చాలా కీలకమైనవి. విజయవంతమైన సినిమాలకు సాధారణంగా మంచి రేటింగ్‌ లభిస్తుంది. వాస్తవానికి ఐఎండీబీ రేటింగ్‌ల వల్ల రూ.17 కోట్ల వరకు బాక్సాఫీస్‌ కలెక్షన్లు లభిస్తున్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 జనవరి నుంచి ఆగస్టు వరకు విడుదలైన 43 హిందీ సినిమాల సగటు రేటింగ్‌ 5.3. ఇది 18 హిందీ డబ్బింగ్‌ సినిమాలకు లభించిన సగటు రేటింగ్‌ 7.3కంటే తక్కువే.

 బాలీవుడ్
బాలీవుడ్

సింగిల్‌ స్క్రీన్లు తగ్గడమూ సమస్యే.. ప్రస్తుతం థియేటర్లలో సౌకర్యాలు పెరుగుతున్నాయి. సింగిల్‌ స్క్రీన్లు తగ్గుతూ మల్టీప్లెక్సులు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా హిందీ పరిశ్రమపై మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది. సింగిల్‌ స్క్రీన్లతో పోలిస్తే ఈ మల్టీప్లెక్సుల్లో టికెట్ల ఖరీదు కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా ఉంటుంది. ముఖ్యంగా వినోద పన్ను ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. దక్షిణాదిన 62శాతం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లే ఉన్నాయి.. అదే ఉత్తర భారత్‌లో కేవలం 16శాతం, పశ్చిమ భారత్‌లో 10శాతం మాత్రమే ఉన్నాయి. అందుకే దక్షిణ భారత సినిమాలు అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

 బాలీవుడ్
బాలీవుడ్

మిలీనియల్స్‌ను ప్రభావితం చేస్తున్న జానర్స్‌.. ఆయా రాష్ట్రాల సామాజిక,ఆర్థిక పరిస్థితులను బట్టి సినీ ప్రియులను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు యాక్షన్‌, హారర్‌, థ్రిల్లర్‌, కామెడీ వంటి వాటితో ఆకట్టుకొంటున్నాయి. మిలీనియల్స్‌ (25-45 ఏళ్లమధ్యవారు) ఎక్కువగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో జానర్స్‌ను ఇష్టపడుతున్నారు.

దక్షిణ భారత రాష్ట్రాల్లోని పెద్దవారు ఓటీటీల్లో కంటే థియేటర్లలో ఎక్కువగా సినిమాలు చూడటానికి ఇష్టపడుతుండగా.. ఉత్తరభారత్‌లోని రాష్ట్రాల్లో ఈ సంఖ్య తక్కువగా ఉంది.

ఓటీటీలతో అగ్నిపరీక్ష..! వెండితెరకు అసలైన అగ్నిపరీక్ష ఓటీటీలతోనే ఎదురవుతోంది. మొత్తం భారతీయ వినోదపరిశ్రమలో వీటి వాటా కేవలం 7-9శాతం ఉంది. కానీ, దాదాపు 40 ఓటీటీలు వివిధ భాషల్లో ఒరిజినల్‌ మీడియా కంటెంట్‌తో తమ పట్టును నిరంతరం పెంచుకొంటున్నాయి. భారత్‌లో 45 కోట్ల మంది ఓటీటీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2023 నాటికి ఈ సంఖ్య 50 కోట్లను చేరుతుందని అంచనాలున్నాయి. ముఖ్యంగా సినిమాల వీక్షకుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా ఓటీటీల పరమవుతోంది. దాదాపు 50శాతం మంది ప్రజలు నెలకు కనీసం 5 గంటలైనా ఓటీటీలను వీక్షిస్తున్నారు. వీటిల్లో వచ్చే అత్యాధునిక మార్పులు థియేటర్‌ అనుభవాలను ఇళ్లకు తీసుకెళుతున్నాయి.

 బాలీవుడ్
బాలీవుడ్

కాకపోతే వినోద పరిశ్రమలో ఇటువంటి సంఘర్షణ కొత్తేమీ కాదని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. 1980ల ప్రారంభలో వీడియో క్యాసెట్‌ పరిశ్రమ నుంచి సవాళ్లను ఎదుర్కొంది. కానీ, 2000 సంవత్సరం తర్వాత మల్టీప్లెక్సులు అద్భుతమైన సినీ అనుభవాన్ని ఇవ్వడం డీవీడీ, సింగిల్‌ స్క్రీన్లను దెబ్బతీసిన విషయాన్ని గుర్తు చేసింది. తాజాగా ఓటీటీ పరిశ్రమ ఇంటి వద్దే సినీ అనుభవాన్ని ఇస్తోంది. దీంతోపాటు వినియోగదారుడికి సినిమా చూసేందుకు ఉన్న ఆప్షన్లను మెరుగుపర్చింది. భారత ఓటీటీ మార్కెట్‌ 2023 నాటికి రూ.11,944 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ మార్కెట్‌ 2018లో రూ.2,590 కోట్లు. కానీ, ఏటా 36శాతం వృద్ధి నమోదు చేస్తూ వెళుతోందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news