కస్తూర్భా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అస్వస్థత

-

గిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లోఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 16 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులుగా పాఠశాలలో వడ్డిస్తున్న ఆహారం సరిగా ఉండటం లేదని ఆదివారం (ఈనెల 12న) బయటి నుండి ఆహారం తెప్పించారని విద్యార్థినీలు చెప్పారు. సోమవారం (ఈనెల 13న) ఉదయం వండిన కూరలు మంగళవారం (ఈనెల 14న) పెట్టారని, ఇదేంటని అడిగితే నిన్నటివి కాదని బెదిరించడంతో అవి తిన్న వారికి విరేచనాలు అయ్యాయని వాపోయారు. సోమవారం ఉదయం చేసిన శనగలు, స్నాక్స్ మంగళవారం రోజు పెట్టారని, అవి తిన్నవారు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎస్ఓకి చెబితే.. తనకు బయట పని ఉందని చెప్పి.. పట్టించుకోకుండా వెళ్లి మళ్లీ తిరిగిరాలేదని ఆరోపించారు. తమ ప్రాణాల గురించి ఎవరికీ పట్టింపులేదని, ఎన్నిసార్లు ఆహారం బాగా లేకున్న కూడా సర్దుకుపోతున్నామని చెప్పారు.

 

విద్యార్థినీలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆస్పత్రికి వెళ్లారు. అస్వస్థతకు గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న కస్తూర్భా బాలిక విద్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యాలయాల పరిస్థితి ఇంకెలా ఉంటుందంటూ సంబంధిత అధికారుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news