సముద్రం ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. సముద్రంలో దాగి ఉన్న అద్భుతాలను బయటకు తీసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో అద్భుత ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అత్యంత ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మహాసముద్రాల గర్భంలో భారీ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నాయని తెలిపారు. అవి పంచదార కొండలు అని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. సముద్ర గర్భంలోని పచ్చిక కింద అపారమైన చక్కెర నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నారు. సాధారణంగా సముద్ర గర్భంలోని పచ్చిక కార్బన్ ను అత్యధిక మోతాదులో గ్రహిస్తుంది. పర్యావరణ వ్యవస్థలో కార్బన్ ఇంత మొత్తంలో స్వీకరించేది మరొకటి లేదు. ఈ నేపథ్యంలో, మాక్స్ ప్లాంక్ పరిశోధకులు సముద్ర పచ్చికపై పరిశోధనలు చేపట్టారు. ఒక చదరపు కిలోమీటరు పరిధిలోని సముద్ర పచ్చిక, భూమిపై అంతే పరిమాణంలో ఉన్న అటవీప్రాంతం కంటే రెండు రెట్లు అధికంగా కార్బన్ ను నిల్వ చేసుకుంటుందని గుర్తించారు. అంతేకాదు, 35 రెట్లు వేగంగా కార్బన్ ను గ్రహించగలదని తెలుసుకున్నారు.
తమ అధ్యయనంలో భాగంగా ఈ సముద్ర పచ్చిక బయళ్ల కింది భాగాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అద్భుతం అనదగ్గ అంశాన్ని గుర్తించారు. పెద్ద మొత్తంలో చక్కెర నిల్వలు ఆ మట్టిలో ఉన్నట్టు తేలింది. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మాన్యుయెల్ లీబెకె దీనిపై వివరణ ఇస్తూ… సముద్ర పర్యావరణ వ్యవస్థలో గతంలో గుర్తించిన చక్కెర నిక్షేపాల కంటే ఇది 80 శాతం అధికమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఉన్న సముద్ర చక్కెర పరిమాణం 1.3 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని, ఇది 32 బిలియన్ క్యాన్ల కోకాకోలా పానీయంలోని చక్కెరకు సరిసమానం అని లీబెకె పేర్కొన్నారు.