ఎప్రిల్ రాకముందే మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో పాటు భారత దేశం అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఎంతలా ఎండలు కొట్టాయంటే…122 ఏళ్ల రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. 122 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో మార్చి నెలలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే ప్రథమం. చివరి సారిగా 1901లో ఈ స్థాయిలో ఎండలు కొట్టాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చిలో సగటున 33.01 ఉష్ణోగ్రత నమోదు అయిందని ఐఎండీ వెల్లడించింది.
ఇంతలా ఉష్ణోగ్రతలు పెరగడానికి తక్కువ వర్షపాతమే కారణం అని ఐఎండీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మార్చి నెలలో సగటున 30.4 మిల్లీ మీటర్ల అని… కానీ ఈ ఏడాది మార్చిలో మాత్రం కేవలం 8.9 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని.. ఇది సగటు కన్నా 71 శాతం తక్కువ అని వాతావరణ శాఖ తెలిపింది. ఈ స్థాయిలో వర్షపాతం తగ్గిపోవడం 1908 తరువాత ఇప్పుడే అని చెబుతోంది. దీంతోనే దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలుస్తోంది. రానున్న రెండు నుంచి నాలుగు రోజులు మధ్యప్రదేశ్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా వేడిగాలులు వీస్తాయని మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోెంది.