గర్భం దాల్చాను అని శుభవార్త చెప్పడం ఆమె ఉద్యోగానికి ముప్పు తెచ్చింది. అందుకామె నిరాశ పడలేదు. ఆ అవమానానికి దీటైన సమాధానం చెప్పాలని అనుకుంది. అందులోనూ సమాజ హితం ఉండాలనుకుంది. ఆ దిశగా తను వేసిన అడుగులు ఆమెనో వ్యాపారవేత్తగా నిలిపాయి. విదేశాలకూ విస్తరించే లక్ష్యంతో సాగుతోన్న వైశాలి మెహతా తోటి మహిళలకూ సాధికారత కల్పిస్తోంది..
వివాహమై, తొలిసూరు గర్భం దాల్చడం ప్రతి మహిళకూ సంతోషాన్నిస్తుంది. అదే ఆనందం గుజరాత్‌కు చెందిన వైశాలికీ కలిగింది. తను బెంగళూరులోని ఓ సంస్థలో డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. చేరిన మూడు నెలలకు గర్భం దాల్చడంతో ఆ సంతోషాన్ని తోటి సిబ్బందితో పంచుకుంది. ఒక రోజు తనను అకస్మాత్తుగా ట్రావెల్ విభాగానికి మార్చింది యాజమాన్యం. అక్కడ ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. కారణం అడిగితే, గర్భంతో ఉన్నావు కదా, అధిక బరువు పెరగకూడదని మార్చామన్నారు. దానివెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు తను. పొమ్మనకుండా పొగబెట్టినట్టు, తనే ఉద్యోగం మానేసేలా చేయడం కోసం ఇలా మార్చడం వైశాలికి చాలా అవమానంగా అనిపించింది. మహిళలకు గౌరవాన్నివ్వని చోట ఎందుకని రాజీనామా చేసేసింది.
తనకు చేసిన అవమానానికి తగిన సమాధానం చెప్పాలనిపించింది వైశాలికి. ‘ముంబయిలో మాస్ కమ్యూనికేషన్, వీడియోగ్రఫీలో డిగ్రీ, మీడియా అండ్ కమ్యూనికేషన్‌లో ఎంబీఏ చేశా. మా వారు సుమీర్ సూరత్ ఎన్.ఐ.టి.లో ఇంజినీరింగ్ చేశారు. ఆపరేషన్స్ అండ్ బిజినెస్ ప్రాసెస్‌లో తనకు 15 ఏళ్ల అనుభవం ఉంది.
‘ఓసారి న్యూయార్క్‌లో తాజా సిరప్‌లతో చేసే పానీయాల రుచి చూశా. ఎంతో నచ్చింది. మన దేశానికి వచ్చాక అలాంటివి తెప్పించుకున్నా. తాగితే వాటి నిండా రసాయనాలున్నట్లు అర్థమైంది. వీటిని సహజ సిద్ధంగా తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అలా 2017లో మొదటిసారి కోల్డ్ ప్రెస్డ్ జ్యూసరీ తయారు చేశా. నాకే నచ్చలేదు. ఇలా కాదని, పరిశోధన ప్రారంభించా. రెండేళ్లు రకరకాల ప్రయోగాలు చేశాక కానీ నేననుకున్న రుచులను సాధించలేకపోయాను. ఆ తర్వాత మాక్‌టైల్, కాక్‌టైల్ మిక్సెస్, ఐస్డ్ టీ, లెమనేడ్స్, క్రాఫ్ట్ కాఫీ తయారు చేయగలిగాను. దాంతో 2019లో ‘స్వా ఆర్టిసనల్ సిరప్’ సంస్థను స్థాపించాం.’ అని వైశాలి చెప్పింది.
ఇంతలో కొవిడ్ లాక్‌డౌన్. దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించింది. అమెజాన్, బిగ్‌బాస్కెట్, క్రెడ్ వంటి వేదికలను తన ఉత్పత్తుల నాణ్యతతో మెప్పించింది. అలా 2020 చివర్లో ఆన్‌లైన్‌లో ఈ ఉత్పత్తుల విక్రయాలు తిరిగి మొదలయ్యాయి.
‘తాజా పండ్లు, మూలికలు, మసాలాలతో 60కి పైగా సిరప్‌లు చేస్తున్నాం. రెండేళ్లలోనే బస్కిన్ రాబిన్స్, చాయ్ పాయింట్, లివింగ్ ఫుడ్ కో, బ్లూ టొకాయ్, థర్డ్‌వేవ్‌కాఫీ రోస్టర్స్, కేఫ్ దిల్లీ, హాషీ హైదరాబాద్ వంటి పెద్ద బ్రాండ్స్‌తో కలిసి పని చేస్తున్నాం. 200కు పైగా అవుట్‌లెట్స్‌లో మా ఉత్పత్తులు దొరుకుతున్నాయి. ప్రతి నెలా ఆన్‌లైన్‌లోనే 10 వేల ఆర్డర్లు వస్తున్నాయి. ఉద్యోగంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని మరి కొందరు మహిళలకైనా తప్పించాలనుకున్నా. అందుకే మా యూనిట్‌లో అన్నిచోట్లా మహిళలనే తీసుకుంటా. మహిళలు అనుకున్నదేదైనా సాధించ గలరనడానికి నేనే ఉదాహరణ’ అంటున్న వైశాలి ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ.