ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో మరో ఉత్కంఠ పోరు చోటు చేసుకుంది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా.. ఇవాళ హెడింగ్లీలో ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో మరో ఉత్కంఠ పోరు చోటు చేసుకుంది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా.. ఇవాళ హెడింగ్లీలో ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే చివరికి పాకిస్థాన్‌నే విజయం వరించింది. ఆఫ్గనిస్థాన్‌పై పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకోవడంతోపాటు అటు సెమీస్ రేసులోనూ నిలిచింది.
మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్లలో అస్గర్ ఆఫ్గన్ (35 బంతుల్లో 42 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్ (54 బంతుల్లో 42 పరుగులు, 6 ఫోర్లు)లు ఆకట్టుకున్నారు. ఇక పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు తీయగా, ఇమాద్ వసీం, వహబ్ రియాజ్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అలాగే షాదాబ్ ఖాన్‌కు 1 వికెట్ దక్కింది.
ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు 230 పరుగులు చేసింది. అయితే పాకిస్థాన్ ఒక దశలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో ఓ దశలో ఆఫ్గనిస్థాన్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివర్లో ఆఫ్గనిస్థాన్ బౌలర్లు పరుగులు ఎక్కువగా ఇవ్వడంతో.. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా.. పాకిస్థానే విజయం సాధించింది. కాగా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో ఇమాద్ వసీం (54 బంతుల్లో 49 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు), బాబర్ ఆజం (51 బంతుల్లో 45 పరుగులు, 5 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించారు. ఇక ఆఫ్గనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, మహమ్మద్ నబీలకు చెరో 2 వికెట్లు దక్కగా, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.