తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు”అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నరికి రేపటి వరకు సమయం ఇచ్చింది.
అక్రమ ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు పొన్ముడిని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అతని నేరాన్ని, రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు నిలిపేసింది. తమిళనాడులో అధికార డీఎంకే అతడిని మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే, గవర్నర్ రవి దీనికి అంగీకరించకపోవడం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
“రేపు మీ వ్యక్తి మాట వినకుంటే.. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని గవర్నరిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం. తమిళనాడు గవర్నర్ ప్రవర్తనపై తాము ఆందోళన చెందుతున్నాము. మేము కళ్లు తెరిచే ఉన్నాము, రేపు ఏం జరగాలో నిర్ణయిస్తాం” అని ప్రధాని న్యాయమూర్తి చంద్రచూడ్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.