తమిళనాడును వర్షాలు విడవడం లేదు. గత నెల నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. వరసగా వస్తున్న అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడులోని దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు కోస్తా జిల్లాలు, చెన్నై నగరంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది.
తమిళనాడులోని నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.చెన్నై, తిరువళ్లూర్ణ కాంచీపురం, రాణీపేట్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.